కలం, వెబ్ డెస్క్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో (Agricultural University) పేపర్ లీకేజీ సంచలనంగా మారింది. దీంతో బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్న 35 మంది ఎంట్రెన్స్ లను రద్దు చేశారు. రీసెంట్ గా వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్యతో పాటు కొందరు ఆఫీసర్లు జగిత్యాల అగ్రికల్చర్ కాలేజీని విజిట్ చేసినప్పుడు అక్కడ రికార్డులను, సీసీ ఫుటేజీని పరిశీలించారు. వీటి ఆధారంగా సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్స్ పేపర్స్ లీక్ అయినట్టు అనుమానించారు. ఈ ఉదంతంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు ముగ్గురు ఆఫీసర్లతో కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ అన్ని కోణాల్లో విచారణ జరిపి.. 35 మంది ప్లాన్ ప్రకారం ఎగ్జామ్ పేపర్స్ లీక్ చేసినట్టు గుర్తించారు. వ్యవసాయ శాఖలో ఏఈఓలుగా పనిచేస్తూ ప్రస్తుతం అగ్రికల్చర్ యూనివర్సిటీలో (Agricultural University) ఇన్ సర్వీస్ కోటాలో థర్డ్ ఇయర్ చదువుతున్న 35 మంది అభ్యర్థులు.. వర్సిటీ సిబ్బంది సాయంతో లీక్ చేసినట్టు తేలింది. లీక్ చేసిన పేపర్లను వాట్సాప్ గ్రూపుల్లో, వేరే అగ్రికల్చర్ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్లకు పంపుతున్నారని.. దీని కోసం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు అధికారుల విచారణలో తేలింది.
ప్లాన్ ప్రకారమే కొన్నేళ్లుగా ఇది సాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న ఒక ఉన్నతాధికారితో పాటు నలుగురు సిబ్బందిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వైస్ ఛాన్సలర్. 2014 నుంచి 2024 దాకా వర్సిటీలో ఉన్నతాధికారులు లేకపోవడంతోనే ఇలాంటి అవకతవకలు జరిగాయని.. అందులో ఈ ఎగ్జామ్ లీక్ కుంభకోణం ఒకటని వైస్ ఛాన్సలర్ జానయ్య తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసి కంప్లీట్ విచారణ చేయిస్తామన్నారు. ఇందులో ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు. భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు జానయ్య.


