కలం, వెబ్‌డెస్క్: సరైన ధ్రువపత్రాలు లేకుండా, వేల సిమ్ కార్డులు అమ్మి, భారీ స్థాయిలో సైబర్ నేరాలకు కారణమైన ఓ టెలికాం సంస్థ ఏరియా మేనేజర్‌ను సీబీఐ (CBI ) అరెస్ట్ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నిబంధనలు అతిక్రమిస్తూ సదరు అధికారి బల్క్‌గా సిమ్ కార్డులు జారీ చేసి, సైబర్ ముఠాకు సహకరించాడని గురువారం ఓ ప్రకటనలో సీబీఐ వెల్లడించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీ–ఎన్సీఆర్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సైబర్ నేర ముఠాపై నిరుడు సీబీఐ ఆపరేషన్ చక్రవ్యూహం ప్రకటించింది. దర్యాప్తులో ఈ ముఠా బల్క్ ఎస్‌ఎంఎస్‌లు, కాల్స్‌తో భారతీయ పౌరులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతోందని గుర్తించింది. ఈ క్రమంలో సైబర్ ముఠాకు అన్ని వేల సిమ్ కార్డులు రావడం వెనక ఓ టెలికాం అధికారి పాత్ర ఉన్నట్లు కనుగొంది. సదరు అధికారి సుమారు 21,000 సిమ్ కార్డులను డీఓటీ నిబంధనలకు విరుద్ధంగా సేకరించినట్లు తేల్చింది. వీటిని సైబర్ నేరగాళ్లకు అమ్మగా, వాళ్లు బల్క్ ఎస్‌ఎంఎస్‌లు, కాల్స్‌తో భారీ స్థాయిలో సైబర్ నేరాలకు పాల్పడినట్లు గుర్తించింది. ఈ సిమ్ కార్డులను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా నియంత్రిస్తూ, నకిలీ లోన్లు, పెట్టుబడి అవకాశాలు, ఇతర ఆర్థిక లాభాల పేరుతో సందేశాలు పంపి, ప్రజల వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు దోచుకున్నారని కనుగొంది.
లార్డ్ మహవీర సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగులుగా డమ్మీ వ్యక్తులను చూపిస్తూ, వారి పత్రాలను కేవైసీ కోసం సమర్పించి పెద్ద ఎత్తున సిమ్ కార్డుల జారీకి సదరు అధికారి సహకరించినట్లు బయటపడింది. బెంగళూరులో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులను కూడా ఉద్యోగులుగా చూపించి సిమ్‌లు జారీ చేయించినట్లు సీబీఐ (CBI) గుర్తించింది. దీంతో సదరు టెలికాం ఆపరేటర్‌కు బేడీలు వేసింది. కాగా, ఈ కేసులో అంతకుముందే టెలికాం సంస్థకు చెందిన ఒక ఛానల్ పార్ట్‌నర్‌తో సహా ముగ్గురిని నిరుడు డిసెంబర్‌లోనే అరెస్ట్ చేసి కస్టడీకి తరలించినట్లు సీబీఐ పేర్కొంది.
సైబర్ నేరాలకు పాల్పడేవాళ్లతోపాటు, వాళ్లకు అండగా నిలుస్తున్న వ్యవస్థలను కూకటివేళ్లతో సహా పెకిలించడానికి సీబీఐ ఆపరేషన్ ‘చక్రవ్యూహం’ అమలుచేస్తోంది. సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, పేమెంట్ గేట్‌వేలు వంటి మౌలిక సదుపాయాలను నేరగాళ్లకు అందిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్ధేశ్యం.


