కలం, నల్లగొండ: రాష్ట్రంలో రూ.60 వేల కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy) అన్నారు. అలాగే రూ.20వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు చేస్తున్నట్లు చెప్పారు. మన్ననూరు- శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌ను త్వరలో నిర్మించనున్నట్లు తెలిపారు. గురువారం నల్లగొండలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. నల్లగొండను కార్పొరేషన్‌గా మార్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఙతలు తెలిపారు. త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నల్లగొండకు మేయర్ రానున్నారన్నారు. నల్లగొండను మోడల్ సిటీగా అభివృద్ధి చేయడం తన సంకల్పమని మంత్రి అన్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. నల్లగొండకు రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. బ్రహ్మంగారిగుట్ట వద్ద అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. రూ.27 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ పనులు సైతం పూర్తి చేశామన్నారు.
శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు
అంతకుముందు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy) .. అన్నేశ్వర గుట్ట వద్ద అమృత్-2 పథకం కింద రూ.కోటి 45లక్షలతో నిర్మించిన తాగునీటి ట్యాంకును, లతీఫ్ సాబ్ గుట్ట సమీపంలో రూ.50 లక్షలతో నిర్మించిన ఎస్ఈ-2 యూనిట్ కార్యాలయం, దొనకల్లో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించారు. రూ.3కోట్ల 14 లక్షల 60వేల వ్యయంతో వల్లభరావు చెరువు, రూ.68.83 లక్షలతో మోతికుంట సుందరీకరణ పనులకు, లెప్రసీ కాలనీలో రూ.3 కోట్లతో నిర్మించనున్న 33/11 కె.వి.సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. లెప్రసీ కాలనీ వద్ద ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. స్కూలుకు కాంపౌండ్ వాల్ మంజూరు చేశారు. మోతికుంట అంగన్ వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి, భవనానికి కూలర్లు, ఫ్యాన్, బొమ్మలు మంజూరు చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భూముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ప్రజారోగ్య పర్యవేక్షక ఇంజనీర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ అహ్మద్, మాజీ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.


