కలం డెస్క్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet) సంక్రాంతి కంటే ముందే జరగనున్నది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలతో పాటు హ్యామ్ రోడ్ల నిర్మాణం, ఎస్‌క్రో అకౌంట్, దావోస్ టూర్ తదితర పలు అంశాలపై చర్చ జరగనున్నది. ఇప్పటికింకా క్యాబినెట్ భేటీకి తేదీలు ఖరారు చేయనప్పటికీ భోగి పండుకంటే ముందే నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో (జనవరి 14, 15, 16) ఎలాగూ మంత్రులు వారివారి కుటుంబ సభ్యులతో నియోజకవర్గాల్లోనే జరుపుకుంటారు. జనవరి 17న మంత్రి శ్రీధర్‌బాబు దావోస్ టూర్ కోసం వెళ్తారు. జనవరి 18 ఆదివారం కావడంతో పబ్లిక్ హాలీడే రోజు అధికారులను ఇబ్బంది పెట్టడం బాగుండదనేది మరో వాదన. ఇక 19న ముఖ్యమంత్రి దావోస్ టూర్‌కు బయలుదేరుతారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సంక్రాంతికంటే ముందే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించే అవకాశాలున్నాయని ఆ వర్గాలు వివరించాయి.
మున్సిపల్ ఎన్నికలపై చర్చ :
పట్టణ స్థానిక సంస్థలకు వీలైనంత తొందరగా ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఓటర్ల జాబితా మొదలు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం దశలవారీగా సన్నాహకాలను పూర్తి చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే షెడ్యూలు ఖరారు చేయడంపై దృష్టి సారించనున్నది. దీనితో పాటు హ్యామ్ పద్ధతిలో రాష్ట్రంలో నిర్మించనున్న రోడ్లు, కేటాయించాల్సిన బడ్జెట్, కాంట్రాక్టర్లతో ఇటీవల జరిగిన సమావేశంలో తీసుకున్న ఎస్‌క్రో అకౌంట్ పద్ధతి తదితర పలు అంశాలపై క్యాబినెట్ చర్చించనున్నది. ఈ నెల 17 నుంచి 23 వరకు దావోస్ టూర్, ఆ తర్వాత వారం రోజుల పాటు అమెరికాలో ముఖ్యమంత్రి టూర్ ఉన్న దృష్ట్యా ఆ అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో (Telangana Cabinet) చర్చకు రానున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం.
Read Also: ఆడబిడ్డ ఇష్యూ.. అడకత్తెరలో ఆ ముగ్గురు!
Follow Us On : WhatsApp


