కలం, వెబ్ డెస్క్ : ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో బాలికలకే ప్రాధాన్యం ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy). బాలికలకే ఈ స్కూల్స్ లో ఎక్కువ కేటాయించాలన్నారు. విద్యాశాఖపై సెక్రటేరియట్ లో నిర్వహించిన సమీక్షలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాబోయే మూడేళ్లలో ప్రతి నియోజకవర్గంలో వైఐఐఆర్ సీ నిర్మాణాలు పూర్తి చేయాలి. ఇందులో ఒకటి బాలికలకు, ఇంకొక్కటి బాలురకు ఉండాలి. మొదట కట్టేది బాలికలకే ఇవ్వాలి. ఇందులో నిర్మించే సోలార్ కిచెన్లను పీఎం కేసుమ్ లో నిర్మించే అవకాశాలను చూడాలన్నారు. ఇప్పుడు కొడంగల్ లో అమలవుతున్న ఉచిత బ్రేక్ ఫాస్ట్, లంచ్ స్కీమ్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా కసరత్తులు చేయాలని’ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు.
హైదరాబాద్ లో కడుతున్న 23 స్కూల్స్ వచ్చే విద్యా సంవత్సరంలోపు పూర్తి చేయాలన్నారు సీఎం. బాచుపల్లి స్కూల్ కు అరెకరమే ఉండటంపై సీఎం ఆరా తీశారు. వెంటనే అరెకరం కేటాయించాలన్నారు. ప్రతి స్కూల్ కు కనీసం ఎకరంనర స్థలం ఉండాలని.. ఒకటి నుంచి పదో తరగతి దాకా సిలబస్ మార్పుపై కసరత్తులు స్టార్ట్ చేయాలన్నారు. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని వేగంగా కంప్లీట్ చేయాలన్నారు. పాలిటెక్నికల్ కాలేజీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే స్టూడెంట్లకు కచ్చితంగా జాబ్ వచ్చేలా వాళ్లకు స్కిల్స్ నేర్పించాలని రేవంత్ రెడ్డి సూచించారు. మీటింగ్ లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, పి.సుదర్శన్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, ఉస్మానియా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మొలుగారం కుమార్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వి.ఎల్.వి.ఎస్.ఎస్.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


