కలం, కరీంనగర్ బ్యూరో : సింగరేణి అధికారులకు కొత్త పంచాయితీ వచ్చి పడింది. సంస్థ చేపడుతున్న గనుల విస్తరణ అధికారులకు ముందు నుయ్యి, వెనుక గొయ్యిగా మారింది. నోటిఫై చేసిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని అధికారులు ఆదేశించినా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. సింగరేణి (Singareni) సంస్థ ఇచ్చే పరిహారం కోసం వందల సంఖ్యలో ఇండ్లు, ఇతర అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ఆందోళనకు దిగుతున్నారు.
సింగరేణి సంస్థ పెద్దపల్లి జిల్లా రామగుండం రివిజన్–3 పరిధిలోని ఓపెన్ కాస్ట్–2 విస్తరణ చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం రామగిరి, మంథని మండలాల్లోని రాజాపూర్, ఆదివారంపేట, సిద్దిపల్లి గ్రామాల్లో సుమారు 444ఎకరాల భూమి సేకరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకుంది. భూసేకరణ చేపట్టి పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే టైమ్ లో అక్రమంగా పరిహారం పొందాలని భావించిన కొందరు పెద్ద సంఖ్యలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు.
ఇండ్ల నిర్మాణాలు, కోళ్ల పారాలు, వ్యవసాయ బావుల తవ్వకాలు చేపడుతున్నారు. సింగరేణి (Singareni) సేకరిస్తున్న భూమిలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఇప్పటికే పెద్దపల్లి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ అధికారులతో పాటు విద్యుత్ అధికారులు మీటర్లు ఇవ్వొద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ కలెక్టర్ ఆదేశాలను ఎవరూ పట్టించుకోవట్లేదు. సిద్దిపల్లి గ్రామంలో వాస్తవానికి 38 ఇళ్లు మాత్రమే ఉండగా ప్రస్తుతం 500వరకు అక్రమంగా ఇళ్ల నిర్మాణం చేశారు. ఇలాగే 50వరకు కోళ్ల పారాలు నిర్మించడంతో పెద్ద సంఖ్యలో వ్యవసాయ బావులు తవ్వించడం, బోరు బావులు తవ్వించడం లాంటివి చేస్తున్నారు. వాటిని అడ్డుకుంటే స్థానికులు ఆందోళనకు దిగుతున్నారు. ‘మా పట్టా భూముల్లో మేము నిర్మాణాలు చేసుకుంటే మీకు ఏంటని’ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల రామగిరి మండలం ఆదివారం పేట గ్రామంలో ఎనిమిది ఇళ్లను కలెక్టర్ దగ్గరుండి కూల్చివేయిస్తే గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో సింగరేణి విస్తరణ ప్రాంతాల్లో ఇప్పుడు పని చేస్తున్న అధికారులకు ముందు నుయ్యి.. వెనక గొయ్యిగా మారింది.


