కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో మొదలైన రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Project) రగడ.. ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. మీరే ఆపారని చంద్రబాబు.. లేదు లేదు మీరే ఆపారని జగన్.. మొత్తానికి ఎవరు చెప్పేది నమ్మాలో ఏపీ ప్రజలకు అర్థం కాని పరిస్థితి. మాజీ సీఎం కేసీఆర్ కృష్ణా జలాల నీటి హక్కులపై లేవనెత్తిన అంశం.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపిన క్రెడిట్ తనదే అని చెప్పేదాకా వెళ్లింది. ఇంకేముంది అటు వైసీపీ ఈ అంశాన్ని ఏపీలో రాయకీయం చేసేసింది. చిన్న సందు దొరికినా ఏపీ రాజకీయాలు అట్టుడికిపోతుంటాయి. అలాంటిది రాయలసీమకే అతిపెద్ద అంశం అయిన ఎత్తిపోతల పథకంపై వివాదం జరుగుతుంటే రచ్చ మామూలుగా ఉంటుందా. వెంటనే సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి.. జగన్ సీఎంగా ఉన్నప్పుడే దాన్ని ఆపేశారన్నారు.
జగన్ ప్రభుత్వం ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడితే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం దానిమీద కోర్టుల్లో పిటిషన్లు వేసి 2020లోనే ఆపించిందన్నారు. దీంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు జగన్ ప్రభుత్వం రూ.100 కోట్ల ఫైన్ కూడా కట్టిందని కొన్ని ఉత్తర్వులను చూపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆపమంటే ఏపీ సీఎంగా తాను ఆపలేదని.. అదంతా అవాస్తవం అన్నారు. కేవలం కాంట్రాక్టుల కోసమే వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పర్మిషన్లు లేకపోయినా ప్రారంభించి.. రూ.2వేల కోట్లు వృథా చేసిందన్నారు. పర్మిషన్లతో కడితే ఇప్పుడు ఎవరూ ఆపేవారు కాదన్నారు.
దీంతో నేడు జగన్ ప్రెస్ మీట్ పెట్టి.. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్వయంగా తాను ఆపానని చెబుతుంటే చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారన్నారు. తాను ఎన్నడూ రాయలసీమను (Rayalaseema Project) ఆపలేదంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో చేసుకున్న క్లోజ్డ్ డోర్ ఒప్పందం ప్రకారమే ఆపేసి తనమీద నింద వేస్తున్నారని అంటున్నారు. దీంతో చంద్రబాబు చెప్పేది నిజమా.. లేదంటే జగన్ చెబుతోంది నిజమా తెలియక ఏపీ ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. మొత్తానికి కేసీఆర్ లేవనెత్తిన అంశం అటు ఏపీ రాజకీయాల్లో మంటలు రాజేస్తోంది. అటు రాయలసీమలో వైసీపీ దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని భావిస్తోంది. చూస్తుంటే ఈ వివాదం మరింత పెరిగేలా కనిపిస్తోంది.
Read Also: వైసీపీ ఎమ్మెల్యేల జీతాలపై కొత్త రాజకీయం..?
Follow Us On : WhatsApp


