కలం, నల్లగొండ బ్యూరో: తెలంగాణ కృష్ణా జలాల వాటా విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి(Komatireddy) వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే ఎలాంటి ప్రయత్నాలనైనా అడ్డుకుంటామని ఆయన గట్టిగా హెచ్చరించారు. శ్రీశైలం జలాశయంలో 820 అడుగుల నీటిమట్టం సాధించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని, తద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఘాటు విమర్శలు గుప్పించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఎస్ఎల్బీసీ సొరంగం పనులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే ముందు, నల్లగొండ జిల్లాకు ఏం చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, కేవలం రాజకీయ సెంటిమెంట్లతో ప్రజలను ఇకపై మభ్యపెట్టలేరని తేల్చిచెప్పారు. నల్లగొండ జిల్లా సమగ్ర అభివృద్ధిపై మంత్రి భారీ ప్రకటనలు చేశారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇందులో భాగంగా రూ.60 కోట్లతో నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్‌ను ఆధునికీకరిస్తామని, డిసెంబర్ 8న అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూ.2 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడంతో పాటు మల్టీప్లెక్స్ థియేటర్, స్కైవాక్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లో స్థిరపడిన నల్లగొండ వాసులు తిరిగి సొంతూరికి వచ్చేలా నగరాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని కోమటిరెడ్డి అన్నారు.
ఇంటింటికీ తాగునీటి పైపులైన్, ప్రతి వీధిలో సీసీ రోడ్లు వంటి ఆధునిక మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మైనారిటీలకు కుట్టు మిషన్లు, ఇతర పరికరాలు, 22 మందికి కొత్త పింఛన్లు, మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. అభివృద్ధి పనులతోనే నల్లగొండ భవిష్యత్తును మారుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

