కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) పైర్ అయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మీరు సీఎం రేవంత్ రెడ్డిని ఒకటి అంటే ఆయన పది అంటడు. ఎందుకు ఆయన్ని గెలికి కయ్యం పెట్టుకుంటున్నారు? అందుకే ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలి. మీ అహంకారం వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా మారకుండా అదే పద్ధతిలో ఉంటే మీకే నష్టం’’ అని ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు.
‘‘రాజకీయంగా విమర్శించండి, లేకుంటే ప్రభుత్వం హామీలు అమలుపర్చకుంటే లిఖితపూర్వకంగా రాహుల్‌కు లేఖ పంపండి. కానీ అనవసరంగా విమర్శించొద్దు. ఇప్పటికైనా కేటీఆర్ (KTR) క్షమాపణలు చెప్పాలి’’ అని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. కాగా జనగామ కాంగ్రెస్ నేతలు కూడా కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. కేటీఆర్ బొమ్మను ఉరి తీసి.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


