కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయస్థానాలే లక్ష్యంగా సాగిన బాంబు బెదిరింపు (Bomb threat)లు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. ఒకేసారి చిత్తూరు, అనంతపురం, ఏలూరు జిల్లా కోర్టులకు ఈ-మెయిల్ ద్వారా బాంబు హెచ్చరికలు రావడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
చిత్తూరు జిల్లా కోర్టుకు తొలుత అనామక వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది. కోర్టు ప్రాంగణంలో బాంబులు అమర్చామని, త్వరలోనే వాటిని పేల్చేస్తామని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. అనతంరం ఆత్మహుతి దాడి జరుగుతుందంటూ అనంతపురం కోర్టుకు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇదే తరహా ఏలూరు జిల్లా కోర్టుకు కూడా వచ్చింది.
బాంబు బెదిరింపు (Bomb threat) సమాచారం అందిన వెంటనే జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులను కోర్టు ప్రాంగణాల నుంచి బయటకు పంపించారు. బాంబు డిటెక్షన్ స్క్వాడ్‌లు, డాగ్ స్క్వాడ్‌లతో కోర్టులో తనిఖీ చేశారు. సోదాల అనంతరం చిత్తూరు, అనంతపురం కోర్టుల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. దీంతో ఆ రెండు చోట్ల వచ్చినవి ఫేక్ మెయిల్స్‌గా భద్రతా బలగాలు నిర్ధారించాయి. ఏలూరు కోర్టులో తనిఖీలు కొనసాగుతున్నాయి.
ప్రాథమిక విచారణలో ఈ మూడు మెయిల్స్ ఒకే ఈ-మెయిల్ ఐడీ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. భయాందోళనలు సృష్టించేందుకే ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ పనికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. ఈ మెయిల్స్ వెనుక ఉన్న నిందితులను పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.


