కలం డెస్క్: పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ఏఐసీసీ నియమించినా పది మంది ఇంకా బాధ్యతలను చేపట్టలేదు. గాంధీభవన్‌లో గురువారం జరిగిన సమావేశం సందర్భంగా సీనియర్ నేతలు హాజరైన సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన పీసీసీ చీఫ్ (PCC Chief) మహేశ్ కుమార్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నవంబరు 23న ఏఐసీసీ నుంచి ఉత్తర్వులు వెలువడినా ఎందుకు బాధ్యతలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేసి వీలైనంత తొందరగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టకపోవడం కేడర్‌కు నెగెటివ్ మెసేజ్ వెళ్తుందన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులు యాక్టివ్‌గా లేకపోవడంతో ఫలితాల్లో తేడా వచ్చిందని గుర్తుచేశారు.
మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం పడొద్దు
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా పార్టీ అధ్యక్షులపై (DCC) కీలకమైన బాధ్యతలు ఉంటాయని పీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని పార్టీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పది మంది డీసీసీ అధ్యక్షులు బాధ్యతలు చేపట్టాలని పీసీసీ చీఫ్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటే నియోజకవర్గానికి దూరమవుతామని, పని ఒత్తిడి పెరుగుతుందనేది కొందరి అభిప్రాయం. కొన్ని జిల్లాల్లో అదే పార్టీకి చెందిన ప్రత్యర్థి వర్గానికి పోస్టు వచ్చిందనే అసంతృప్తి కూడా బాధ్యతలు చేపట్టకపోవడానికి ఒక కారణం. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే పార్టీ నిబంధనకు విరుద్ధంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ డీసీసీ అధ్యక్షుడి పోస్టు ఇవ్వడంపై కొద్దిమంది తటపటాయిస్తున్నారు.


