ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీసీ సంఘాల గళం

కలం, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిలు పేరుకుపోవడంతో లక్షలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో వారి చదువులు, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్సులు పూర్తి చేసిన సుమారు 6 లక్షల మంది విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేయడం బాధాకరమన్నారు. ఫీజుల బకాయిల కారణంగా ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ప్రభుత్వం వివిధ అవసరాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, విద్యార్థుల విద్యకు సంబంధించిన రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం విద్యార్థి వ్యతిరేక చర్య అని విమర్శించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిగుర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదని, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు సమాన విద్యావకాశాలు కల్పించే కీలక పథకమని పేర్కొన్నారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను బీసీ సంఘాలు సహించవని హెచ్చరించారు.

ప్రభుత్వానికి మా ప్రధాన డిమాండ్లు:
  • పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగించాలి.
  • కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు కళాశాలలు వెంటనే సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకోవాలి.
  • పెండింగ్ నిధుల విడుదలకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలి.

ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు నిర్వహించి వినతిపత్రాలు అందజేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా నిరసన చేపట్టి విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు గుంటి స్వరూప, యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నల్లగొని శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ అనుమస నితిన్, అంజాద్, బీసీ మహిళా సంఘం జనరల్ సెక్రటరీ కరుపాక మునక్క, టౌన్ ప్రెసిడెంట్ రాజుల నవ్య, టౌన్ జనరల్ సెక్రటరీ బొంతుల తిరుమల, బీసీ సంఘం నాయకులు రమేష్, అశ్విత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>