కలం, ఖమ్మం బ్యూరో: రాబోయే గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి కొత్త శోభ తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందుకోసం సుమారు రూ.300 కోట్లతో ఆలయ పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. బుధవారం భద్రాచలంలో పర్యటించిన ఆయన, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఆలయ రాతి కట్టడాల నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించి ప్రారంభించారు.
అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆలయ అభివృద్ధి పనులు, పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల్లో ఎలాంటి జాప్యం సహించేది లేదని స్పష్టం చేసిన ఆయన, తక్షణమే కార్మికుల సంఖ్యను కనీసం 300 మందికి పెంచి పనులను పరుగులు పెట్టించాలని అధికారులను ఆదేశించారు. సెంట్రింగ్, స్టీల్, రాడ్ బెండింగ్ కార్మికులతో పాటు ఇంజనీరింగ్ సిబ్బంది కొరతను వెంటనే తీర్చాలన్నారు. పెండింగ్లో ఉన్న డ్రాయింగ్లు, డిజైన్లను త్వరగా పూర్తి చేసి, రాతి నిర్మాణాలకు అవసరమైన సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాలను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు వివిధ శాఖల ద్వారా ఇప్పటికే రూ.1,100 కోట్లకు పైగా నిధులు కేటాయించామని మంత్రి వెల్లడించారు. భద్రాద్రి ఆలయానికి అవసరమైతే మరిన్ని నిధులు సమకూరుస్తామని, భవిష్యత్ తరాలకు శాశ్వత ఆస్తిగా నిలిచేలా రాతి కట్టడాలను నాణ్యతతో నిర్మించాలని చెప్పారు. డిసెంబర్ 19న ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో తాత్కాలిక ఏర్పాట్లకు పరిమితం కాకుండా శాశ్వత సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
ఉత్తర, దక్షిణ పుష్కర ఘాట్ల డ్రాయింగ్లకు త్వరగా ఆమోదం పొంది పనులు ప్రారంభించాలని, కరకట్టల నిర్మాణంలో రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రజాప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పర్యటనలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూతన మార్కెట్లో రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న గిరిజన బహుళ ప్రయోజన మార్కెట్ కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
అలాగే రంగనాయకుల గుట్ట వద్ద రూ.5.45 కోట్లతో జీఎల్ఎస్ఆర్ (భూస్థాయి నీటి నిల్వ ట్యాంకు) నిర్మాణం, బోర్వెల్స్, పంపుసెట్లు, పైప్లైన్ల ఏర్పాటు, ఘాట్ వద్ద శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, దేవస్థానం ఈఓ దామోదర్ రావు, సర్పంచ్ పూనెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

