కలం, కరీంనగర్ బ్యూరో: రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీన టీపీసీసీ ఆధ్వర్యంలో ‘సంవిధాన్ రక్షా మార్చ్’ (Samvidhan Raksha March) రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
రేపు ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్దనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం (లిబర్టీ) నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమం(Samvidhan Raksha March)లో ఏఐసీసీ ఇన్చార్జి బి.ఎం. సందీప్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారని వెల్లడించారు.
Also Read : మహేశ్ ఒక్క కామెంట్.. చిన్నారి రీల్‌కు 26 మిలియన్ వ్యూస్!
Follow Us On : WhatsApp

