కలం, వెబ్ డెస్క్ : భారత ఈ-కామర్స్ రంగంలో ప్రముఖ సంస్థగా ఎదిగిన ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) కీలక మార్పు చోటుచేసుకుంది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) కల్యాణ్ కృష్ణమూర్తి తన పదవి నుంచి వైదొలగుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్‌లో 11 ఏళ్లకు పైగా కొనసాగిన ఆయన ప్రయాణం ముగియడంతో సంస్థ నాయకత్వంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.
కల్యాణ్ కృష్ణమూర్తి నాయకత్వంలో ఫ్లిప్‌కార్ట్ వ్యాపారం గణనీయంగా విస్తరించింది. ఆయన పదవీకాలంలో కంపెనీ కార్యకలాపాలు ఐదింతలకు పైగా వృద్ధి చెందగా, దేశవ్యాప్తంగా వినియోగదారులు, విక్రయదారులకు చేరువయ్యేలా అనేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్ షాపింగ్ రంగంలో పోటీని ఎదుర్కొంటూ సంస్థను బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఫ్లిప్‌కార్ట్ నిర్వహించే ప్రతిష్ఠాత్మక ‘ది బిగ్ బిలియన్ డేస్’ సేల్‌ను దేశంలో పండుగ షాపింగ్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిపారు. వ్యాపార విస్తరణతో పాటు సంస్థ పాలనా విధానాలు, పారదర్శకత, నిర్వహణ ప్రమాణాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇచ్చారు.
వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, సీఈఓ క్రిస్ నికోలస్ కల్యాణ్ సేవలను ప్రశంసిస్తూ, ఆయన నాయకత్వం ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ సంస్థలకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందని పేర్కొన్నారు. సంస్థకు అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు తన ప్రయాణంపై కల్యాణ్ స్పందిస్తూ, ఫ్లిప్‌కార్ట్ అభివృద్ధిలో భాగస్వామిగా ఉండటం గర్వంగా ఉందని, సంస్థ భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేశారు.

