ఎంజీఎంలో దంత వైద్యుల కొరత.. రోగుల నరకయాతన!

కలం, వరంగల్ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను బలోపేతానికి ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నా.. వరంగల్ ఎంజీఎంలోని (Warangal MGM Hospital ) దంత వైద్య విభాగానికి మాత్రం ఆ అవకాశం దక్కడం లేదు. నిత్యం 500 నుంచి 600 మంది వరకు రోగులు చికిత్స కోసం వచ్చే ఈ విభాగంలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఒకవైపు రోగుల సంఖ్య పెరుగుతుండగా, మరోవైపు అందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది లేకపోవడంతో సేవలపై భారం పెరుగుతున్నది. ఇటీవల ఎంజీఎం, కాకతీయ వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో 168 వైద్య పోస్టుల భర్తీకి మూడు నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ.. దంత వైద్య విభాగానికి ఒక్క పోస్టు కూడా కేటాయించకపోవడం చర్చనీయాంశమైంది. ఆరు నెలలుగా ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉండటంతో పాటు సీనియర్ రెసిడెంట్లు కూడా లేకపోవడం ఈ విభాగం పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. వేలాది మంది రోగులకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ దంత వైద్య సేవలు సిబ్బంది కొరత కారణంగా ఆశించిన స్థాయిలో అందడం లేదనే ఆవేదన వ్యక్తమవుతున్నది.

168 పోస్టుల భర్తీ.. డెంటల్ కు చోటేది?

ఎంజీఎం, కాకతీయ వైద్య కళాశాలలో వైద్యుల కొరతను అధిగమించేందుకు ఇటీవల మూడు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. కేఎంసీ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జారీ చేసిన రెండు నోటిఫికేషన్ల ద్వారా 152 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చారు. ఇందులో 22 ప్రొఫెసర్, 20 అసోసియేట్ ప్రొఫెసర్, 110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. మరోవైపు ఎంజీఎం సూపరింటెండెంట్ 16 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగానికి ఏడు, ఆర్థోపెడిక్స్‌ నాలుగు, రేడియాలజీకి రెండు, పీడియాట్రిక్స్, కార్డియాలజీ, న్యూరో సర్జరీ విభాగాలకు ఒక్కో పోస్టు చొప్పున కేటాయించారు. నవంబర్ 2న నిర్వహించిన వాక్‌ఇన్ ఇంటర్వ్యూకు 53 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టినప్పటికీ, రోజుకు వందలాది మంది రోగులు వచ్చే దంత వైద్య విభాగాన్ని పూర్తిగా విస్మరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైద్యుల అవసరాన్ని గుర్తించి పోస్టుల భర్తీ చేపట్టినప్పుడు దంత విభాగంలోని ఖాళీలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఓపీ వద్ద పడిగాపులు.. టోకెన్లకు తంటాలు

ఉదయం నుంచే ఆసుపత్రికి వచ్చే రోగులు ఓపీ వద్ద బారులు తీరుతున్నారు. టోకెన్లు తీసుకునేందుకు తంటాలు పడాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు. టోకెన్ దొరికినా వైద్యుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు ఎంజీఎంకు వస్తుండటంతో రద్దీ మరింత పెరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో దంత విభాగంలో వైద్యుల కొరత వారి ఇబ్బందులను మరింత పెంచుతుందని విమర్శలు వస్తున్నాయి.

ఆరు నెలలుగా ప్రొఫెసర్ పోస్టు ఖాళీ

దంత వైద్య విభాగంలోని ప్రొఫెసర్ ఆరు నెలల కింద బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి ఖాళీగానే ఉంది. ఇప్పటివరకు మరొకరిని నియమించకపోవడం, కనీసం సీనియర్ రెసిడెంట్లను కూడా అందుబాటులో ఉంచకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతున్నది. ట్రాక్టు పద్ధతిలో వైద్యులను నియమించేందుకు గతంలో ఇంటర్వ్యూలు నిర్వహించినప్పటికీ నియామకాలు కొలిక్కి రాలేదు. దీంతో ఖాళీల భర్తీపై ఆశలు పెట్టుకున్న రోగులకు నిరాశే మిగులుతున్నది. ఒకవైపు వైద్య సేవల కోసం వచ్చే వారి సంఖ్య భారీగా ఉంటే, మరోవైపు వైద్యుల సంఖ్య పరిమితంగా ఉండటంతో విభాగం నిర్వహణ సవాలుగా మారుతున్నది.

పోస్టులు భర్తీ.. సేవలు మెరుగు

ప్రభుత్వం ఆస్పత్రుల్లో వైద్యుల ఖాళీల భర్తీకి కేవలం కొత్త నోటిఫికేషన్లు జారీ చేయడమే కాకుండా.. ఆయా విభాగాల్లో రోగుల సంఖ్య, వైద్య సేవల అవసరం, అందుబాటులో ఉన్న సిబ్బందిని పరిగణనలోకి తీసుకొని నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆరు నెలలుగా ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టును భర్తీ చేయడంతో పాటు సీనియర్ రెసిడెంట్లు, అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాలని రోగులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దంత విభాగంపై ప్రత్యేక దృష్టి సారించి వైద్య సేవలను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>