కలం, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలోని ఎస్సీ గురుకుల హాస్టల్ (Jogipet SC Girls Hostel) లో కలుషిత ఆహారం కారణంగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ లో భోజనం వికటించడంతో విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. తొలుత నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం రాగా, తాజా నివేదిక ప్రకారం మొత్తం ఏడుగురు విద్యార్థినులను చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
హాస్టల్ సిబ్బంది తమకు పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఘటన బయటకు పొక్కకుండా ఉండేందుకు అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ప్రిన్సిపల్ గదిలో ఉంచి తాళం వేశారని తోటి విద్యార్థులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకుని ప్రిన్సిపల్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు హాస్టల్ వంట గదిని తనిఖీ చేసి విచారణ చేపట్టారు.

