కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నిత్యం రద్దీగా ఉండే వరంగల్ క్రాస్‌రోడ్డు కూడలి దగ్గర్లోని ఓ వెల్డింగ్ షాపు సమీపంలో జనరేటర్ వద్ద ఉన్న మినీ ట్యాంకర్లో యాసిడ్ లీకేజీ ఘటన తీవ్ర కలకలం రేపింది. బ్యాటరీ ఛార్జింగ్ చేస్తున్న సమయంలో అమ్మోనియా వాయువు వెలువడినట్లు (Ammonia Gas Leakage) ప్రాథమికంగా అనుమానిస్తున్న ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఘాటైన రసాయన వాసన వ్యాపించింది.
దీంతో స్థానికులు, వ్యాపారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. వాసన తీవ్రతకు భయాందోళనకు గురైన వ్యాపారులు ముందుజాగ్రత్తగా తమ దుకాణాలను మూసివేశారు. వాయువు ప్రభావంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, పాదచారులు సైతం ఆ వాసనను తట్టుకోలేక ముక్కుకు కర్చీఫ్‌లు అడ్డుపెట్టుకుని పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవగా, పలువురికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గొంతులో మంట, కళ్ల మంట వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆసుపత్రులకు తరలివెళ్లి చికిత్స పొందుతున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే ఖమ్మం రూరల్ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో అక్కడికి చేరుకుని, వాయువు ప్రభావం మరింత విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించారు. విషయం తెలుసుకున్న ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అసలు లీకేజీకి కారణం ఏమిటి, వెలువడింది నిజంగా అమ్మోనియా వాయువేనా, ఏ స్థాయిలో లీకైంది అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే కూడలి, జనావాసాల మధ్య ఇలాంటి ప్రమాదకర రసాయన వాయువులు వెలువడే పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు. ఘటనకు గల కారణాలను పూర్తిస్థాయిలో విచారించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

