పార్టీలకతీతంగా బీసీలంతా ఏకమవ్వాలి: మంత్రి వాకిటి శ్రీహరి

కలం, వెబ్ డెస్క్ : బీసీల రాజ్యాంగబద్ధమైన హక్కులు, రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యంగా పోరాడాలని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari ) పిలుపునిచ్చారు . కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో కులగణన చేపట్టామని, దేశవ్యాప్తంగా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారని మంత్రి గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన ద్వారా బీసీల సమగ్ర గణాంకాలు వెల్లడయ్యాయని, ఈ లెక్కల ఆధారంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం సముచిత వాటా దక్కాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 47 శాతానికి పైగా సీట్లు కేటాయించామని, అలాగే రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ మోదీ ప్రభుత్వం స్పందించడం లేదని మంత్రి విమర్శించారు. ఇప్పటికే ఐదారు తరాలుగా వెనుకబాటుకు గురైన బీసీలు, కనీసం భావితరాల భవిష్యత్తు కోసమైనా పార్టీ జెండాలను పక్కనపెట్టి సమష్టి ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. ఇప్పుడు గళమెత్తకపోతే రాబోయే తరాలు మనల్ని క్షమించవని స్పష్టం చేస్తూ, బీసీలకు చట్టబద్ధమైన హక్కులు కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

బీసీల ఐక్యతను, ఉద్యమ బలాన్ని దేశ రాజధాని వేదికగా చాటిచెప్పేందుకు డిసెంబర్ 14న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న మహా కార్యక్రమానికి తెలంగాణ నుంచి బీసీలు భారీ ఎత్తున తరలిరావాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. రాజ్యాంగబద్ధమైన హక్కులు సాధించుకునే వరకు విశ్రమించకుండా, ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>