కలం, వెబ్ డెస్క్: పాలకుర్తి (Palakurthi) నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నియోజకవర్గ ఇంచార్జి ఝాన్సీ రెడ్డికి, స్థానిక సీనియర్ నాయకులకు మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) వద్దకు చేరాయి. చాలా కాలంగా పాలకుర్తి నేతలు ఝాన్సీ రెడ్డి పనితీరుపై అసంతృప్తితో ఉండగా, తాజాగా ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు అసమ్మతి వర్గం సిద్ధమైంది.
ఈరోజు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీనాక్షి నటరాజన్‌తో పాలకుర్తి (Palakurthi) నియోజకవర్గ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ ప్రతినిధి బృందంలో తొర్రూరు మార్కెట్ చైర్మన్ హన్మండ్ల తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్‌తో పాటు పలువురు కీలక నేతలు ఉన్నారు. నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్లను ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి వర్సెస్ అసంతృప్తి నేతలు అన్నట్లుగా పరిస్థితి మారింది. పాలకుర్తిలో జరుగుతున్న తాజా పరిణామాలను, పార్టీ క్యాడర్‌లో నెలకొన్న గందరగోళాన్ని మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)కు ఈ నేతలు వివరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో, పార్టీలో ఈ విబేధాలు నష్టం కలిగిస్తాయని వారు అధిష్టానానికి విన్నవించనున్నారు.


