కలం, వెబ్ డెస్క్: ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య కేసులో (Pranay Murder Case) తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమృత బాబాయ్ తిరునగరు శ్రవణ్ కుమార్‌కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
గతంలో ఈ కేసును విచారించిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు.. ప్రణయ్ హత్యలో శ్రవణ్ కుమార్ పాత్ర ఉన్నట్లు నిర్ధారించి అతనికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ శ్రవణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై వచ్చిన ఆరోపణలు, తనకు విధించిన శిక్షపై దాఖలు చేసిన పిటిషన్ విచారణ ముగిసే వరకు తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.
ముఖ్యంగా శ్రవణ్ కుమార్ వయసు, ఆయన ఇప్పటికే గడిపిన జైలు శిక్షా కాలం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉన్నందున, తుది తీర్పు వచ్చే వరకు ఆయన బయట ఉండేందుకు న్యాయస్థానం అనుమతించింది.
2018 సెప్టెంబర్ లో మిర్యాలగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట అమృత భర్త పెరుమాళ్ల ప్రణయ్ దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో (Pranay Murder Case) ప్రధాన నిందితుడు మారుతీరావు ఇప్పటికే ఆత్మహత్య చేసుకోగా, మిగిలిన నిందితులకు గతేడాది కింది కోర్టు శిక్షలు ఖరారు చేసింది. ఇప్పుడు శ్రవణ్ కుమార్‌కు బెయిల్ లభించడంతో ఈ కేసు మరోసారి వార్తల్లో నిలిచింది.
Read Also: సోనియా ఆరోగ్యం కోసం వీహెచ్ మృత్యుంజయ యాగం
Follow Us On: Pinterest


