కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోళ్లను (Jagtial Paddy Procurement) సజావుగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా 425 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ముందు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించాన్నారు.
ముఖ్యంగా ధాన్యంలో తేమ శాతం, తాలు, తప్ప, మట్టి పెళ్లలు తదితర అంశాలను ముందుగానే పరిశీలించుకోవాలని కలెక్టర్ తెలిపారు. సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ జారీ చేసిన ధృవీకరణ పత్రం ఆధారంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయనున్నట్లు వారు స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు, జాప్యం తలెత్తకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ రైతులకు సకాలంలో సేవలు అందించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి కొనుగోలు ప్రక్రియకు సహకరించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

