కలం, హనుమకొండ: కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు కేటీఆర్ తన సోదరి కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య (MP Kadiyam Kavya) డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజాప్రతినిధులు సైతం చిన్న పనుల కోసం ఫామ్హౌస్ల చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు. అలా తెలంగాణ ఆత్మగౌరవాన్ని గడీల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజుతో కలిసి ఎంపీ కావ్య మాట్లాడారు.బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లక్ష్యంతో రూ.40 వేల కోట్లు కేటాయించిందని, కొత్తగా 4.6 లక్షల పింఛన్లు మంజూరు చేసిందని తెలిపారు.
రూ.75 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు..
మహిళా సంఘాలకు ఇప్పటికే రూ.75 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 75 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ఎంపీ కావ్య పేర్కొన్నారు. గత ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీని నిర్లక్ష్యం చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.52 కోట్లు కేటాయించిందని ఎంపీ కావ్య తెలిపారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో రెండేళ్లలో సుమారు రూ.6 వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు.
మామునూరు విమానాశ్రయం, పీఎం మిత్ర టెక్స్టైల్ పార్క్, యూఐడీఎఫ్ కింద రూ.551 కోట్లు, భద్రకాళి మాడవీధుల అభివృద్ధి, ఐటీఐ భవనం, పెద్దమ్మగడ్డ రిటైనింగ్ వాల్ పనులు ఇందులో ఉన్నాయన్నారు. తన ఎంపీ నిధుల్లో రూ.12 కోట్లను అభివృద్ధి పనులకు కేటాయించినట్లు వివరించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధమని కేటీఆర్కు సవాల్ విసిరారు.

