చట్టసభలో ప్రజా సమస్యలపై గళమెత్తుతా: ఆకాష్ కొల్లూరు

కలం, వనపర్తి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం చట్టసభలో గళమెత్తుతానని హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, తెలంగాణ రక్షణ సేన నాయకుడు ఆకాష్ కొల్లూరు(Akash Kolluru) అన్నారు. ఎన్నికల్లో డబ్బు, ప్రలోభాలకు తావులేకుండా ప్రజా సమస్యలపై పనిచేసే అభ్యర్థులకే పట్టభద్రులు మద్దతు ఇవ్వాలని కోరారు. సోమవారం వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన ప్రైవేటు హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు.

జూరాల ప్రాజెక్టు పరిధిలో సాగునీటి ఇబ్బందులు, వ్యవసాయ విద్యుత్ కోతలు, పంట నష్టాలకు పరిహారం, గిట్టుబాటు ధర కల్పనపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. వనపర్తి పట్టణంలో రహదారి విస్తరణ, డ్రైనేజీ పనులతో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన బాధితులకు ఇచ్చిన హామీల ప్రకారం న్యాయం చేయాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా చేపట్టాలని, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు.

విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. డబ్బుతో ఓట్లు కొనడానికి తాను ఎన్నికల్లోకి రాలేదని, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పోరాడటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అభ్యర్థులందరూ ప్రజలకు చేసిన పనులు, భవిష్యత్తు కార్యాచరణపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సామాజిక న్యాయమే లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన అజెండా అని, పదవి కోసం కాకుండా ప్రజల హక్కుల కోసం పోరాడుతానని ఆయన వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>