కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నిత్యం అనేక సమస్యలను ఎదుర్కొంటున్న ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీఓపీ) కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ(CITU) జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని ఎమ్మెస్ ఫంక్షన్ హాల్లో పీఓపీ కార్మికుల జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షుడు సోహెల్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కురుమూర్తి మాట్లాడుతూ.. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న పీఓపీ కార్మికులకు బిల్డర్లు, యజమానులు, ఆర్కిటెక్టర్లు ఒప్పందం ప్రకారం నిర్ణయించిన వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను బెదిరించి తక్కువ వేతనాలకు పనిచేయించుకోవడం కార్మిక వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన స్థానిక కార్మికులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
పనిచేసే సమయంలో ప్రమాదాలు జరిగినా బిల్డర్లు, యజమానులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికులకు గుర్తింపు కార్డులు కల్పించి, నైపుణ్యం కలిగిన వారితోనే పనులు చేయించాలని సూచించారు. ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కార్మికులను బెదిరించడం, పెనాల్టీలు వసూలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.
జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి వరదగాలన్న మాట్లాడుతూ.. కార్మికులకు శ్రమకు తగిన వేతనాలు చెల్లించాలని, ప్రమాదాలు జరిగితే నష్టపరిహారంతో పాటు వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్మాణ రంగంలోని ఇతర కార్మిక సంఘాలు కూడా పీఓపీ కార్మికులకు అండగా ఉంటాయని తెలిపారు. సంఘం నాయకులు కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని, లేబర్ కార్డు, ఐడెంటిటీ కార్డు, ఇస్రామ్ కార్డులు పొందాలని విజ్ఞప్తి చేశారు.

