కలం, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలోనే ఒక కీలక ఘట్టమని బీఆర్ఎస్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) కొనియాడారు. నిరాహార దీక్ష ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడిందని పేర్కొన్నారు. నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ నగరంలోని మంకమ్మతోటలో విస్తృతంగా ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గంగులతో పాటు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హాజరై పార్టీ శ్రేణులతో కలిసి ప్రజలకు బొట్టుపెట్టి దీక్షా దివస్ సభకు ఆహ్వానించారు.
మంకమ్మతోటలోని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల, ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను వారి పేర్లతో ఆత్మీయంగా పలకరిస్తూ దీక్షా దివస్ సభకు రావాలని ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం, ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలు, కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ద్వారా రాష్ట్ర ఏర్పాటు దిశగా జరిగిన పరిణామాలను ప్రజలకు వివరించారు.
కేసీఆర్ దీక్షతోనే ఉద్యమానికి మలుపు..
1969 నుంచి 1972 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినప్పటికీ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరలేదని, అనంతరం దశాబ్దాల పాటు తెలంగాణ అంశం రాజకీయ పార్టీల పదవుల రాజకీయాల్లో నలిగిపోయిందని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమ ఆకాంక్షలను ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ 2009 నవంబర్ 29న కరీంనగర్ నుంచి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారని గుర్తుచేశారు.
కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. కేసీఆర్ దీక్షను విరమింపజేసేందుకు అరెస్టు చేసినప్పటికీ ఉద్యమం మరింత ఉధృతమైందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కరీంనగర్ గడ్డ నుంచి ప్రారంభమైన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో చరిత్రాత్మక మలుపుగా నిలిచిందన్నారు.
దీక్షా దివస్ ప్రజల పండుగ..
నవంబర్ 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమం ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపమని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దీక్షా దివస్ సభను విజయవంతం చేయడానికి నగరంలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను గుర్తుచేసుకునే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, కార్పొరేటర్లు గుగ్గిళ్ళ జయశ్రీ, నలువాల పుష్పలత, నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, గందే మాధవి, నందేల్లి రమాదేవి, పార్టీ డివిజన్ అధ్యక్షులు,మాజీ కార్పొరేటర్లు నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

