హత్య కేసులో నిందితుడికి రెండు జీవిత ఖైదులు, ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష

కలం, నల్లగొండ : హత్య కేసులో నిందితుడికి రెండు జీవిత ఖైదులతో పాటు మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, మొత్తం రూ.15 వేల జరిమానా విధిస్తూ నల్లగొండలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం (Nalgonda Court) తీర్పు వెలువరించింది. ఈ వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. నల్లగొండ జిల్లా హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుముల గ్రామానికి చెందిన యనక ప్రభాకర్ (34)ను, అదే గ్రామానికి చెందిన టేకి సురేష్ (32) డబ్బుల లావాదేవీలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో 2020 సెప్టెంబరు 24న హాలియా ఎన్‌ఎస్‌పీ ఎడమ కాలువ రివులెట్ బ్రిడ్జి సమీపంలో సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు.

ఈ ఘటనపై హాలియా పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 202/2020 కింద ఐపీసీ సెక్షన్ 302, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ 3(2)(v), దివ్యాంగుల హక్కుల చట్టం-2016లోని సెక్షన్ 92(a) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు పటిష్టమైన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో సమర్పించడం, ప్రాసిక్యూషన్ సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో నిందితుడిపై నేరం రుజువైంది. దీంతో నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం, రెండవ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి ఈ నెల 23న తుది తీర్పు వెలువరించారు. ఐపీసీ సెక్షన్ 302 కింద నిందితుడికి జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం సెక్షన్ 3(2)(v) కింద మరో జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా, దివ్యాంగుల హక్కుల చట్టం-2016 సెక్షన్ 92(a) కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. ప్రతి సెక్షన్ కింద జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా నాలుగు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మూడు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి దర్యాప్తు అధికారులు ఎస్‌ఐ జె. శివకుమార్, సీఐపి. వీర రాఘవులు, మిర్యాలగూడ ఎస్‌డీపీఓ వై. వెంకటేశ్వర్ రావు, ప్రస్తుత మిర్యాలగూడ ఇంచార్జ్ డీఎస్పీ రవి, హాలియా సీఐ రాఘవరావు, డీసీఆర్బీ సీఐ శ్రీను నాయక్, ఎస్‌ఐ సాయి ప్రశాంత్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్-గ్రేడ్-1 ఎస్. శోభారాణి, కోర్టు డ్యూటీ ఆఫీసర్ హెడ్ కానిస్టేబుల్ ఆర్. పద్మయ్య, లైజన్ అధికారులు పి. నరేందర్, ఎన్. మల్లికార్జున్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>