కలం, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలోని ఫోటోజర్నలిస్టుల నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు వారిని ప్రోత్సహించేందుకు ఫోటోజర్నలిస్టుల సంఘం (టీఎస్‌పీజేఏ) ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్త ఫోటోగ్రఫీ పోటీల (TS PJA Awards) విజేతలను ప్రకటించారు. 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల ఫలితాలను హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో ఉన్న టీఎస్‌పీజేఏ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం సంఘం అధ్యక్షులు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్. హరి వెల్లడించారు. ఈ పోటీలో కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజాపక్షం ఫోటో జర్నలిస్ట్ పిట్టల శ్రీధర్ కన్సోలేషన్ బహుమతి అందుకున్నారు.
పిట్టల శ్రీధర్ గతంలోనూ పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు. 2023 నవంబర్‌లో విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్, ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ ఫోటో జర్నలిజం వేడుకల్లో ఆయన ఉత్తమ ఫొటోగ్రఫీ అవార్డు సాధించారు. అగ్నిప్రమాదవశాత్తు ఇంటిలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిన చిత్రానికి గాను మెమోరియల్ అవార్డుతో పాటు గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఫోటో జర్నలిస్టుగా పనిచేస్తూ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో అప్పటికే 18 అవార్డులు సాధించిన పిట్టల శ్రీధర్, తాజాగా టీఎస్‌పీజేఏ రాష్ట్ర స్థాయి అవార్డుకు (TS PJA Awards) ఎంపికవడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

