కలం, నిర్మల్: అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేసి నష్టపోయిన బాధితులకు (AgriGold Victims) ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని, బాధితుల అసలు బాండ్లు, నగదు రసీదుల ధ్రువీకరణతో పాటు వివరాల నమోదు ప్రక్రియను ఈ నెల 25 నుంచి చేపట్టనున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదివారం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, సీఐడీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా బాధితుల కోసం మంచిర్యాల జిల్లా నస్పూర్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక ధ్రువీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బాధితులు తమ మండలానికి కేటాయించిన తేదీల్లో అక్కడికి హాజరై వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇందుకోసం అసలు ఆగ్రిగోల్డ్ బాండ్ లేదా నగదు రసీదు, ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్, పాస్పోర్ట్ సైజు ఫొటో తీసుకురావాలని తెలిపారు. డిపాజిటర్ మరణించినట్లయితే నామినీ లేదా చట్టబద్ధ వారసులు మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు సంబంధిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. అసలు బాండ్లను ధ్రువీకరణ కోసం మాత్రమే చూపించాలని, అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పత్రాలు సమర్పించిన వారికి రసీదు అందజేస్తారని తెలిపారు. ధ్రువీకరణ కేంద్రం పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 27న ఖానాపూర్ మండలానికి చెందిన 27 మంది, మార్చి 1న ఖానాపూర్కు చెందిన 222 మంది, లోకేశ్వరం 28 మంది, మార్చి 2న లోకేశ్వరం 217 మంది, ముథోల్ 33 మంది, మార్చి 3న ముథోల్ 212 మంది, నర్సాపూర్ (జి) 38 మంది, మార్చి 4న నర్సాపూర్ (జి) 207 మంది, నిర్మల్ రూరల్ 43 మంది, మార్చి 5న నిర్మల్ రూరల్ 202 మంది, తానూర్ 48 మంది, మార్చి 8న తానూర్ మండలానికి చెందిన 198 మంది బాధితులకు ధ్రువీకరణ చేపట్టనున్నారు. బాధితులు ((AgriGold Victims)) తమకు కేటాయించిన తేదీల్లోనే నస్పూర్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు సీసీఎస్ ఐఓపీ వై. కృష్ణారెడ్డి, 9885352522 మొబైల్ నంబర్ ను సంప్రదించాలని కోరారు.
Also Read : బైకర్ నిర్లక్ష్యం.. ఒకరి మృతి, 12 మందికి గాయాలు
Follow Us On: Youtube

