కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణలో టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. వరంగల్ భద్రకాళి ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న మాడ వీధి పనులను ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఆయన బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల విషయంలో అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే కోరిక మేరకు భద్రకాళి ఆలయాన్ని (Bhadrakali Temple) మహా అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఆలయానికి మరింత వన్నె తెచ్చేలా శాస్త్రోక్తంగా మాడ వీధులతో పాటు అంతర్గత పనులు చేపట్టినట్లు చెప్పారు. ఈ పనులను అధికారులతో కలసి పరిశీలించామని, అవసరమైన నిధులను ముఖ్యమంత్రి వారం కిందటే మంజూరు చేశారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బాసర నుంచి భద్రాచలం వరకు ప్రధానమైన దేవాలయాలన్నింటినీ అభివృద్ధి చేస్తూ టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అంతకు ముందు మంత్రికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి శేషవస్త్రంతో పాటు ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, హన్మకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహ శబరీష్, డా.సత్య శారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ : పొంగులేటి
Follow Us On: X(Twitter)


