కలం డెస్క్: ఐఏఎస్ ఆఫీసర్ల నిర్లక్ష్యం, ఉదాసీనత సర్కారు ప్రాధాన్యతల అమలుకు శాపంగా మారింది. వివిధ శాఖల్లో కీలక బాధ్యతల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆశించినంత వేగం కనిపించడంలేదు. ఇదే అంశాన్ని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రస్తావించారు. వారికి అర్థం చేయించారు. అధికారుల మధ్య ఆధిపత్య పోరు, కోల్డ్ వార్ చివరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పాలసీల అమలులో ప్రతిబింబిస్తున్నదని సీఎం గమనించారు. పలు సమావేశాల్లో వారిని సున్నితంగా హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోకపోవడంతో కొద్దిమందిపై ఇటీవల బదిలీ వేటు వేశారు. గ్లోబల్ సమ్మిట్ తర్వాత సీఎం నిర్వహించే సమీక్షల్లో దూకుడు పెరిగిందని, ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తికావడంతో ఇకపైన నిర్ణయాలన్నీ వేగంగానే ఉంటాయన్న అభిప్రాయం అటు మంత్రుల్లో, ఇటు అధికారుల్లో నెలకొన్నది.
వార్నింగ్ ఇచ్చినా మారని తీరు :
రాష్ట్రంలో కీలక హోదాల్లో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారుల (IAS Officers) తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత కొన్ని నెలలుగా బ్యూరోక్రాట్ల వ్యవహార శైలిపై చురకలు వేస్తున్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించి అలర్ట్ చేశారు. ప్రభుత్వ పాలసీల అమలులో వేగం పెరగాలని సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో “పనితీరు మారకుంటే బదిలీలే.., ప్రతి జిల్లా కలెక్టర్ ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే.., పాలనలో వేగం పెంచండి.. లేదంటే తప్పుకోండి.., ఏసీ గదులు వీడండి.. జనంలోకి వెళ్ళండి..” అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. వ్యక్తిగత విభేదాలు పరిపాలనలో రిఫ్లెక్ట్ కావద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు. అయినా తీరు మారకపోవడంపై ఆగ్రహంతో ఉన్నట్లు సన్నిహితుల సమాచారం. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది సచివాలయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
ఐఏఎస్‌ల మధ్య విభేదాలు :
ఒకే డిపార్టుమెంటులో పనిచేస్తున్నా, వేర్వేరు బాధ్యతలు చూస్తున్నా ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య ఈస్ట్-వెస్ట్ తరహాలో నెలకొన్న వాతావరణం పరిపాలనపై ప్రభావం చూపిస్తూ ఉన్నదనేది సీఎం భావన. అధికారుల మధ్య వ్యక్తిగత విభేదాలు, ఈగోలు, జూనియర్-సీనియర్ తేడాలు రోజువారీ కార్యకలాపాలపై, ఫైళ్ళ మూవ్‌మెంట్‌పై, నిర్ణయాల్లో ప్రతిబింబించడాన్ని మంత్రులు సైతం తప్పుపడుతున్నారు. గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా పలువురు అధికారుల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలు నిర్వహణలో కనిపించాయని, దీన్ని సీఎం గుర్తించారని, ఆయనకు సన్నిహితంగా ఉన్నవారు గుర్తుచేశారు. ఇకనైనా వారి తీరు మారాలని స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన సీఎం రేవంత్.. ఇటీవల జరిగిన ఐఏఎస్ ఆఫీసర్ల సమావేశంలో ఇకపైన ప్రతి నెలా చీఫ్ సెక్రటరీ రివ్యూ చేస్తారని, ప్రతీ ఐఏఎస్ ఆఫీసర్ వారి అప్రైజల్ రిపోర్టును ఆయనకు పంపించాల్సిందేనన్న నిర్ణయాన్ని ప్రకటించారు. దీనికి తోడు ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వయంగా తానే సమీక్షిస్తానని కూడా క్లారిటీ ఇచ్చారు.
బీఆర్ఎస్ పాలనలో అంటుకున్న జాడ్యం :
కొద్దిమంది ఐఏఎస్ అధికారుల్లో ఇలాంటి అలసత్వం నెలకొనడానికి గడచిన పదేండ్ల పాలనలోని పనితీరే కారణమన్న మాటలూ సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అప్పటి సీఎం పట్టించుకోకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి అలవాటు పడ్డారని, మరికొద్దిమంది సీనియర్లకు విస్తృతాధికారాలు ఇవ్వడంతో వారిలో అజమాయిషీ లక్షణాలు వచ్చాయని, జూనియర్లను సీనియర్‌లు లెక్కచేయకపోవడానికి ఆఫీసర్లపై పర్యవేక్షణ లేకపోవడమే కారణమన్నది ఆ వర్గాలు ఉదహరించాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో వేగానికి తగినట్లుగా ఆఫీసర్లు స్పందించడంలేదని, పాత వ్యవహార శైలిని మార్చుకోడానికి సిద్ధపడడంలేదని, అందులో భాగమే ఆఫీసర్ల మధ్య ఆధిపత్య ధోరణి, కోల్డ్ వార్ అని పేర్కొన్నారు. ఆఫీసర్లలోని ఈ అవలక్షణాలే ఇప్పుడు గుదిబండగా మారాయని సీఎం రేవంత్ ఒకింత ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది.

Read Also: నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానంపై ట్విస్ట్
Follow Us On: Sharechat


