కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం బీజేపీ (Khammam BJP) లో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ ఉప్పల్‌లోని సిరి గోల్డ్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూసంపూడి రవీందర్ తో పాటు ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేయడమే అందుకు కారణంగా చెబుతున్నారు. సిరి గోల్డ్ మర్చంట్స్ పేరుతో రూ.20 కోట్ల బంగారం డిపాజిట్ మోసం (Siri Gold Scam) కేసులో ఇద్దరు సీనియర్ తెలంగాణ బీజేపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు కావడంతో ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీలో తీవ్ర స్థాయిలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి.
ప్రత్యర్థులకు అస్త్రంలా ‘సిరి గోల్డ్ స్కాం’ కేసు
ఎప్పటి నుండో ఒక వర్గం బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావుకు పొసగడం లేదు. కోటేశ్వరరావు అధ్యక్షుడు అయ్యాక జిల్లా స్థాయి నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనపై నమోదైన ‘సిరి గోల్డ్ స్కాం’ కేసు ప్రత్యర్థులకు అనుకోని అస్త్రంలా మారింది. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న వ్యతిరేకులు ఈ అంశాన్ని ఆసరాగా తీసుకున్న ఒక వర్గం.. త్వరలో జిల్లా అధ్యక్షుడి మార్పు జరగడం ఖాయం అంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఎన్నో ఏండ్ల నుండి జిల్లా అధ్యక్ష పదవి కమ్మ సామాజిక వర్గం వారికి కేటాయించారు. కానీ ఈసారి ఆ సామాజిక వర్గానికి కేటాయించడంపై బిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.
ఖమ్మం జిల్లా బీజేపీ (Khammam BJP) పార్టీకి బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే ఇప్పటిదాకా వెన్నెముకగా ఉన్నారు. కాబట్టి ఈసారి బీసీ వర్గాలకు అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ ఒక వర్గం తీవ్ర స్థాయిలో అధిష్టానం దగ్గర ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు స్కాంతో తనకు ఎటువంటి సంబంధం లేదు.. కేసు పెట్టిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని నెల్లూరి కోటేశ్వరరావు విలేకరుల సమావేశంలో చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆయనపై ట్రోలింగ్ ఆగడం లేదు.
నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయినప్పటికీ.. జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలతో అరెస్ట్ కాకుండా మేనేజ్ చేసుకున్నాడని పార్టీలోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. దీనిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్న తరుణంలో.. అసలు మంత్రికి బీజేపీ జిల్లా అధ్యక్షుడికి మధ్య ఉన్న సంబంధంపై బీజేపీ అధిష్టానం ఆరా తీస్తుందంటూ మరో ప్రచారం జరుగుతోంది. బీజేపీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల వల్ల జిల్లా అధ్యక్షుడి హోదాలో జిల్లా కార్యాలయంలో సమావేశం పెడితే పట్టుమని పదిమంది కార్యకర్తలు కూడా హాజరు కావడం లేదని కొంతమంది బీజేపీ నేతలు, కార్యకర్తలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. గోల్డ్ స్కామ్ తో ఎటువంటి సంబంధం లేకపోయినా కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని తనమీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ నెల్లూరి కోటేశ్వరరావు చెబుతున్నప్పటికీ, ఆధారాలు లేకుండా అంత పెద్ద కేసులో A2 గా కేసు ఎలా నమోదు చేస్తారంటూ ప్రత్యర్థులు వాదిస్తున్నారు.
Read Also: నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానంపై ట్విస్ట్
Follow Us On: Sharechat


