పేదలకు ఆర్థిక భద్రతే లక్ష్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి

కలం, ఇల్లంతకుంట: కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో పడే నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కొండంత అండగా నిలుస్తుందని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally) అన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత, భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం ఇల్లంతకుంట మండలం వెల్జీపూర్ (Veljipur) గ్రామంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా, ప్రతి అర్హత కలిగిన పేద కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. పేద కుటుంబాలు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు.

గత బీఆర్ఎస్ పాలకులు నిరుపేదలు, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన సాగుతోందని చెప్పారు. పేదల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. అలాగే చేయూత పింఛన్ల ద్వారా దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులు, ఫైలేరియా బాధితులు, క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా రాష్ట్రంలో సుమారు 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, పేదల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ, ఎంపీడీవో వై. శశికళ, తహసీల్దార్ ఆర్. సురేష్, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఊట్కూరి వెంకట రమణారెడ్డి, పార్టీ నాయకులు అంతగిరి వినయ్ కుమార్, ఐరెడ్డి భాస్కర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ నాయిని నవీన్ కుమార్, మామిడి రాజు, నేరెళ్ల విజయ్ గౌడ్ తదితరులతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, ఏఎంసీ, పీఏసీఎస్ డైరెక్టర్లు, ఉప సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>