చట్టాలపై అవగాహనతోనే గ్రామీణ వికాసం: జడ్జి రాజేందర్

​కలం, ఖమ్మం బ్యూరో: చట్టాలపై పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పుడే గ్రామీణ వికాసం సాధ్యమవుతుందని, రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు రసీదులను తప్పనిసరిగా భద్రపరచుకుంటేనే నష్టపోయిన సందర్భాల్లో చట్టపరమైన రక్షణ లభిస్తుందని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం. రాజేందర్ (Judge Rajender) స్పష్టం చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

​విత్తన చట్టం ప్రకారం నాణ్యమైన విత్తనాల ఎంపిక, నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తత, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను జడ్జి వివరించారు. నాణ్యతలేని విత్తనాల వల్ల పంట నష్టం వాటిల్లితే రసీదు ఆధారంగా చట్టపరంగా పరిహారం పొందే మార్గాలను సూచించారు. రైతులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సలహాలు, సహాయాన్ని పొందవచ్చని తెలిపారు. అనంతరం బాల్య వివాహాల నిరోధక చట్టంపై మాట్లాడుతూ, బాల్య వివాహాలు బాలల భవిష్యత్తును అంధకారం చేస్తాయని, ముఖ్యంగా బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.

18 ఏళ్లు నిండని బాలికలకు, 21 ఏళ్లు నిండని బాలురకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, వీటిని ప్రోత్సహించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ​అలాగే పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు పోక్సో చట్టం (POCSO Act) కఠినంగా అమల్లో ఉందని తెలిపారు. పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, వ్యవసాయాధికారి అరుణ్ బాబు, ఏఈవోలు సూరిబాబు, రాహుల్ గాంధీ, సుజాత, సీడీపీవో లలిత, ఎయిడ్ ఎన్జీవో ప్రతినిధులు జ్యోతి, మౌనిక, సర్పంచులు చంద్రలేఖ (ముల్కలపల్లి), సుజాత (మాధారం), ఊకే ఆదిలక్ష్మి (వీకే రామావరం), పారాలీగల్ వాలంటీర్లు వీరభద్రం, భిక్షమయ్య, జానకిరాం, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>