మధిర అంబేద్కర్ సెంటర్‌లో బస్ షెల్టర్ కరువు

కలం, ​మధిర: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పాలకులు చెబుతున్నప్పటికీ, నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే మధిర పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో (Madhira Ambedkar Centre) కనీసం ఒక బస్ షెల్టర్ లేకపోవడం పట్ల స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధిర నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాలకు వెళ్లే వందలాది మంది ప్రయాణికులకు ఈ సెంటర్ ప్రధాన కూడలిగా ఉంది.

ప్రతిరోజూ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు మరియు సామాన్య ప్రజలు ఇక్కడి నుంచే తమ ప్రయాణాలను సాగిస్తుంటారు. అయితే బస్సుల కోసం వేచి ఉండే సమయంలో నిలబడేందుకు కనీసం నీడ కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో మండే ఎండల్లో, వర్షాకాలంలో కురిసే వానకు తడుస్తూ రోడ్డు పక్కనే నిలబడాల్సిన దుస్థితి నెలకొందని వారు వాపోతున్నారు.

​మధిర మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు జరుగుతున్నాయని నాయకులు పేర్కొంటున్నప్పటికీ, ప్రతిరోజూ వందలాది మంది ఎదుర్కొంటున్న బస్ షెల్టర్ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు అవసరమైన కనీస రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం కూడా పాలకుల బాధ్యత అని వారు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. ​

ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రజల ఇబ్బందులను తీర్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్రయాణికుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకుని అంబేద్కర్ సెంటర్‌లో తక్షణమే తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేయడంతో పాటు, ఆధునిక హంగులతో కూడిన శాశ్వత బస్ షెల్టర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ప్రయాణికులు, పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>