కృష్ణా, గోదావరి జలాల్లో ఒక్క చుక్క నీటిని వదులుకోం: ‎మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

కలం, హుజూర్‌నగర్ : కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణ కోసం అవసరమైన ప్రతి సంస్థాగత, న్యాయ వేదికపైనా రాజీలేని పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. గురువారం హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 1.8 టీఎంసీల నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఉత్తమ్ తెలిపారు. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా తెలియజేశామన్నారు. తెలంగాణ వాటాను దెబ్బతీసే ఏపీ ఏకపక్ష చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని తేల్చిచెప్పారు.

భారత వైమానిక దళంలో యుద్ధ విమాన పైలట్‌గా చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో పనిచేసిన అనుభవాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేసుకున్నారు. ‘‘అప్పుడు దేశ సరిహద్దులను కాపాడేందుకు చూపిన క్రమశిక్షణ, ధైర్యం, పట్టుదలతోనే ఇప్పుడు తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడేందుకు పనిచేస్తాను. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని మా ప్రభుత్వం రాష్ట్ర హక్కుల విషయంలో వెనుకడుగు వేయదు’’ అని ఆయన ఉద్ఘాటించారు.

నీటి హక్కుల పరిరక్షణ అనేది రైతుల సాగునీరు, ప్రజల తాగునీరు, లక్షలాది కుటుంబాల జీవనోపాధితో ముడిపడి ఉన్న అంశమని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి వినియోగాన్ని సమర్థంగా మెరుగుపరచడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణ గణనీయంగా పెరిగాయని వివరించారు. ఫలితంగా దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, నాణ్యత లేని పనులకు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కుంగుబాటే నిదర్శనమని ఉత్తమ్ విమర్శించారు. గత పాలకులు వదిలివెళ్లిన సమస్యలను సరిదిద్దుతూ, సాగునీటి మౌలిక వసతులను కాపాడుకుంటున్నామని చెప్పారు. రాబోయే వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>