కలం, నిర్మల్ : ఉక్కు మనిషి, స్వాతంత్ర భారత తొలి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 151వ జయంతిని పురస్కరించుకుని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఏడాది పొడవునా నిర్వహించాల్సిన వివిధ కార్యక్రమాలపై నిర్మల్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) రాథోడ్ రమేష్, అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి గురువారం జిల్లా కలెక్టరేట్లోని డీఆర్ఓ ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తితో ప్రజల్లో జాతీయ సమైక్యత, సమగ్రతలను పెంపొందించేలా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రజల భాగస్వామ్యంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలని వారు సూచించారు. ఈ సమావేశంలో డీఈఓ భోజన్న, డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

