నీటిని వృథా చేయొద్దు.. నగర ప్రజలకు మేయర్ శ్రీనివాస్ విజ్ఞప్తి

కలం, కరీంనగర్ బ్యూరో: నగరంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యం అని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas)  స్పష్టం చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా గురువారం 32వ డివిజన్‌లో మేయర్ పర్యటించారు. హుస్సేనీ పుర ప్రాంతంలో స్థానిక కార్పోరేటర్ యూసుఫ్‌తో కలిసి రూ. 6 లక్షల నిధులతో మంచి నీటి సరఫరా పైపు లైన్ నిర్మాణం పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర ప్రజల త్రాగు నీటికి ఇబ్బందులు కలగకుండా చూడటమే నగరపాలక సంస్థ ప్రధాన ధ్యేయమని అన్నారు. ఇటీవలే డివిజన్‌లో యూఐడీఎఫ్, ఎంజీఎఫ్ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులను కూడా ప్రారంభించామని, ప్రస్తుతం అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. కార్పోరేటర్, స్థానిక ప్రజలు మా దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యను పరిగణలోకి తీసుకుని ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టి, డివిజన్ ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.

నగరపాలక సంస్థ పరిధిలోని విలీన గ్రామాల డివిజన్ల ప్రజల త్రాగు నీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు పాలకవర్గం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే అమృత్ 1,2 పథకంలో మంచి నీటి సరఫరా పైపులైన్ పనులు చేపట్టామని, ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయన్నారు. చివరి దశలో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేసి, విలీన గ్రామాల డివిజన్ల ప్రజలకు త్రాగు నీరు అందిస్తామని తెలిపారు. నగర ప్రజల కోసం డివిజన్లలో అవసరమైన చోట ఓహెచ్‌ఆర్‌లు, సంపులు కూడా నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.

వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళికతో త్రాగు నీటి సరఫరాలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగర ప్రజలు ఎల్ నినో ప్రభావం దృష్ట్యా నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న తాగు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా ఆన్, ఆఫ్ నల్లాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నగర అభివృద్ధిని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం ప్రకారం మంత్రి బండి సంజయ్ సహకారంతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం ముందుకు సాగుతుందని తెలిపారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా, నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మేకల వెంకటేష్, బీజేపీ ముజిబొద్దిన్, డీఈ వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>