ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్యే బాలు నాయక్

‎కలం, దేవరకొండ : రాబోయే రోజుల్లో ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (MLA Nenavath Balu Naik) సూచించారు. అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

గురువారం దేవరకొండ పట్టణ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని, రైతులకు ఒక్కొక్కరికి రూ.1,000 విలువైన 650 గ్రాముల కూరగాయల విత్తనాల మినీ కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ.. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల సాగు ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు.

ముఖ్యంగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని కోరారు. కూరగాయల సాగు ద్వారా ఇంటి అవసరాలతో పాటు రైతులకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుందన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకొని వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను నివారించుకోవాలని పేర్కొన్నారు.

రైతుల సంక్షేమం, అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, ఉద్యాన శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆలంపల్లి నర్సింహా, దూదిపాల వేణుధర్ రెడ్డి, హనుమంతు, వెంకటేష్ గౌడ్, మేకల రాజేందర్ రెడ్డి, లోకసాని కృష్ణయ్య, కొర్ర రాంసింగ్, అంగిరేకుల నాగభూషణం, కాయితి నారాయణ రెడ్డి, నియోజకవర్గ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>