కలం, వెబ్ డెస్క్: పంజాబ్ లో భారీ ప్రమాదం తప్పింది. బాక్రా కాలువ(Bhakra Canal)పై నిర్మించిన ఇనుపవంతెన గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా కుప్పకూలింది (Punjab Bridge Collapse). పాటియాలా-సంగ్రూర్ జాతీయ రహదారిపై ఉన్న వంతెన పాసియానా గ్రామం సమీపంలో ట్రక్కులు దాటుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో రెండు భారీ లారీలు వంతెనతో పాటు కాలువలో వేలాడుతున్నాయి. ఆ తరువాత ఒక ట్రక్కులో మంటలు చెలరేగడంతో భయాందోళనలు నెలకొన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ట్రక్కులో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఫైర్ సేఫ్టీ బృందం శ్రమించింది. అలాగే, లారీల్లో ఉన్న ఇద్దరు డ్రైవర్లను సహాయ బృందాలు సురక్షితంగా రక్షించాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులకు ఊరట కలిగింది.
కాగా, వంతెన కూలిపోవడంతో (Punjab Bridge Collapse) ఆ దారిలో వాహనాలను నిలిపివేసిన పోలీసులు రాకపోకలు బంద్ చేశారు. పక్కనే ఉన్న మరో బ్రిడ్జి ద్వారా ప్రయాణానికి అవకాశం కల్పించారు. అయితే, గతంలో ఈ బ్రిడ్జికి పగుళ్లు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోంది. దీంతో వంతెనను నిర్మించి పదేళ్లు గడవక ముందే కూలిపోవడంతో విమర్శలు వస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read : ఎయిర్‌పోర్టులో కలకలం: టెర్మినల్‌లోకి చొరబాటుకు వ్యక్తి యత్నం!
Follow Us On : WhatsApp

