కలం, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం (Palnadu Accident) చోటుచేసుకుంది. మట్టి లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ, డీసీఎం వ్యాన్ను ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏపీ నుంచి తెలంగాణ వైపు వెళ్తున్న డీసీఎం లారీని, తెలంగాణ వైపు నుంచి వస్తున్న మట్టి లోడు కంటైనర్ లారీ ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన కంటైనర్ లారీ ఒక్కసారిగా డివైడర్ను దాటి, అవతలి వైపు వస్తున్న డీసీఎం లారీపై పడటంతో ఈ పెను ప్రమాదం సంభవించింది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే దాచేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురి మృతదేహాలతో పాటు, గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దాచేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

