కలం, వెబ్ డెస్క్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అంశంపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు (INDIA Bloc) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ తో సహా కేంద్ర ఎన్నికల సంఘంలోని ఇతర ఉన్నతాధికారుల్ని అధికారికంగా ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కూటమి నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ‘సర్’ పై సీఈసీ, ఇతర అధికారుల మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయని పిటిషన్ లో ప్రశ్నించారు. అసలు ‘సర్’ పై ఎవరు నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని పిటిషన్ లో కోరారు.
అలాగే ఫారం – 6 పై సమగ్రమైన సమాధానాన్ని ఇవ్వాలని అన్నారు. ఈ క్రమంలోనే డేటా బేస్ , ECINET భద్రతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో పేర్లను, తొలగించడానికి లేదా మార్చడానికి కేంద్రానికి అధికారం ఉందా? లేదా? అని ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు దీనిపై 48 ప్రశ్నలతో కూడిన దరఖాస్తులను సమర్పించారు. తాజా పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు అంగీకరించింది. ఈ పిటిషన్ విచారణను మంగళవారం ( నవంబర్ 17) సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది.

