కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజావాణి (Prajavani) లో అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్‌బీ హరిప్రియ అధికారులను ఆదేశించారు. సోమవారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా అర్జీదారుల సమస్యలను సావధానంగా విని, ప్రతి ఫిర్యాదును పరిశీలించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజావాణి దరఖాస్తులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా, వాటిలోని అంశాలను పూర్తిగా అర్థం చేసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణిలో రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, నీటిపారుదల, సంక్షేమం, వ్యవసాయం, పౌరసరఫరాలు, భూ సర్వే–రికార్డులు, గృహ నిర్మాణం, రవాణా, పోలీసు, గిరిజన అభివృద్ధి, విద్యుత్, విద్య, వైద్య ఆరోగ్యం, గనులు, అటవీ, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 91 వినతులను అధికారులు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నిర్మల, జెడ్పీసీఈఓ, ఇన్‌చార్జి డీపీఓ వెంకట్‌రెడ్డి, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ యాదగిరి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

