కలం, వెబ్ డెస్క్: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026కు సమయం దగ్గర పడుతోంది. ఈ సమయంలో బంగ్లాదేశ్ (Bangladesh).. భారత్ నుంచి తమ జట్టు ఆడే మ్యాచ్‌లకు వేదికలు మార్చాలని, శ్రీలంకకు షిఫ్ట్ చేయాలని కోరింది. భద్రతా ఆందోళనల కారణంగానే తాము ఈ అభ్యర్థన చేస్తున్నామని పేర్కొంది. కాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనకు ఐసీసీ కచ్చితమైన సమాధానం ఫోన్ ద్వారా చెప్పింది. ఫిబ్రవరి నుంచి మార్చి వరకు జరిగే టోర్నీకి బంగ్లాదేశ్ జట్టు భారత్‌కే రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఆ నిర్ణయాన్ని విస్మరిస్తే కీలక పాయింట్లు కోల్పోయే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లకు తక్షణ భద్రతా ముప్పు కనిపించడం లేదని ఐసీసీ స్పష్టంచేసింది. చివరి నిమిషంలో వేదిక మార్పు జరిగితే షెడ్యూల్ ప్రయాణ ఏర్పాట్లు ప్రసార వ్యవస్థ మొత్తం గందరగోళంలో పడతాయని తెలిపింది. కాగా ఇదే విషయానికి సంబంధించిన అధికారిక తీర్పును జనవరి 10న ప్రకటించనున్నటలు ఐసీసీ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో వేదిక మార్పు డిమాండ్‌కు తావు లేదని తేల్చింది. ఐపీఎల్ (IPL)లో ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కేకేఆర్ నుంచి విడుదల చేయాలన్న బీసీసీఐ ఆదేశాలే ఈ వివాదానికి బీజం వేశాయి. ఈ పరిణామాలతో ఉద్రిక్తతలు పెరగడంతో బీసీబీ ఐసీసీకి లేఖ రాసి వేదిక మార్పు కోరింది. అయితే ఈ వారం ఐసీసీ అధికారికంగా తుది నిర్ణయం తెలియజేయనుండగా ఆ తీర్పు మారే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పుడు నిర్ణయం బంగ్లాదేశ్ చేతుల్లోనే ఉంది. భారత్‌లోనే బరిలోకి దిగాలా లేదా ప్రపంచకప్‌కు దూరంగా ఉండాలా అన్న కీలక అడుగు బీసీబీ తీసుకోవాల్సి ఉంది.


