కలం, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు (Chandrababu) ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ వాయుగుండం ఇవాళ సాయంత్రానికి ‘అక్వాన్ తుఫాను’గా (Cyclone Akwan) మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులకు సీఎంకు తెలిపారు. అంతేకాదు తదుపరి 48 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుఫానుగా కోస్తాంధ్ర తీరం వైపు దూసుకొచ్చే సూచనలు ఉన్నాయని వివరించారు. దీని ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
దీంతో సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్టమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల సంభవించిన తుఫాన్ల నష్టాలను అంచనా వేసేందుకు రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని, క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు తమ పంటను కాపాడుకునేలా తగిన అవగాహన కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. తుఫాను (Cyclone Akwan) కారణంగా తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని సూచించారు.
Also Read : ఏపీ పోలీసులపై సజ్జల ఘాటు వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

