కాంగ్రెస్ స్టేట్ ఇన్‌చార్జ్‌కు అసలైన సవాళ్లు ఇవే!

కలం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ స్టేట్ ఇన్‌చార్జ్‌గా నియమితులైన బీఎం సందీప్‌ (BM Sandeep) కు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. అటు మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య.. ఇటు ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్ల మధ్య విభేదాలు నెలకొనడం.. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటి వివాదాస్పద కామెంట్లు చేస్తుండడం.. నామినేటెడ్ పోస్టుల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న నేతల్లో అసంతృప్తి నెలకొనడం.. ఇప్పుడు ఇవన్నీ కొత్త ఇన్‌చార్జ్‌ ముందున్న సవాళ్లు. వీటిని ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారన్నదే మేజర్ టాస్క్. దీనికితోడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పార్టీని విజయ తీరాలకు చేర్చాల్సిన బాధ్యత కూడా ఇన్‌చార్జ్‌పై ఉన్నది.

కాగా, ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే రాష్ట్ర నేతలతో బీఎం సందీప్ వరుస సమావేశాలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీలోని కీలక నేతలు, అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, డీసీసీ చీఫ్‌లతో సమావేశమై పార్టీలో నెలకొన్న పరిస్థితులపై అవగాహన పెంచుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి.

విభేదాలు.. వివాదాలు

మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మధ్య నెలకొన్న వివాదం స్టేట్ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే ఏఐసీసీకి పీసీసీ నివేదిక ఇచ్చింది. ఈ అంశంపై రాష్ట్ర పార్టీతో పాటు, ఏఐసీసీ స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న చర్చ జరుగుతున్నది. ఈ అంశంపై కొత్త ఇన్‌చార్జ్‌ (BM Sandeep) ఎలా వ్యవహరిస్తారన్నది కీలకంగా మారింది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలకు, లోకల్ లీడర్లకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. కొన్ని వివాదాలు పీపీసీ క్రమశిక్షణా కమిటీకి పరస్పరం ఫిర్యాదులు చేసుకునే స్థాయికి చేరాయి.

పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, కొందరు నేతల మధ్య నెలకొన్న విభేదాలు క్రమశిక్షణా కమిటీకి చేరాయి. ఇంకోవైపు కొందరు ఎమ్మెల్యేలు తరచూ వివాదాస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన కామెంట్లు పార్టీని ఇరకాటంలోకి నెట్టాయన్న చర్చ జరుగుతున్నది. దీంతో ఆ ఎమ్మెల్యేలతో కొత్త ఇన్‌చార్జ్ సమావేశమై మాట్లాడతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

సమన్వయం కీలకం

కాంగ్రెస్‌లో పాత నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల మధ్య కొన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తున్నది. బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్‌లో చేరిన నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దీనికితోడు కొన్ని నియోజకవర్గాల్లో సీనియర్లు, జూనియర్ల మధ్య గ్యాప్ నెలకొన్నది. కొత్త ఇన్‌చార్జ్‌ వీటన్నింటిపై దృష్టిసారించి, నేతల మధ్య సమన్వయం నెలకొల్పాల్సిన అవసరం ఉన్నది.

అసంతృప్తి నేతలకు బుజ్జగింపులు

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది నేతలు నామినేటెడ్ పోస్టుల(Nominated Posts)పై ఆశలు పెట్టుకున్నారు. ఈ పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారా? అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కానీ దాదాపు మూడేండ్లు అవుతున్నా నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగకపోవడంతో అసంతృప్తిలో ఉన్నారు. వాళ్లందరినీ బుజ్జగించడం, పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టులు దక్కేలా చూడడం కొత్త ఇన్‌చార్జ్‌కి పెద్ద టాస్క్.

ఎన్నికలే అసలు టాస్క్

పార్టీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం.. పార్టీ, ప్రభుత్వానికి మధ్య సమన్వయం నెలకొల్పడంతో పాటు రానున్న ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరాలకు చేర్చాల్సిన బాధ్యత కూడా కొత్త ఇన్‌చార్జ్‌పై ఉన్నది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు జరగనున్నాయి. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉన్నది. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుంది.

Also Read : నేడు సోనియా గాంధీ పుస్తకం ఆవిష్కరణ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>