కలం, వెబ్ డెస్క్: చెల్సీ ఫుట్‌బాల్ క్లబ్ (Chelsea Football Club) తన కొత్త హెడ్ కోచ్‌ను ప్రకటించింది. ఎన్జో మారెస్కా స్థానంలో జట్టు కోచ్ బాధ్యతలను లియామ్ రోజెనియర్ చేపట్టనున్నాడు. మంగళవారం ఈ నిర్ణయాన్ని క్లబ్ అధికారికంగా ప్రకటించింది. స్ట్రాస్‌బర్గ్‌లో జరిగిన వీడ్కోలు సమావేశంలోనే స్టాంఫర్డ్ బ్రిడ్జ్‌కు వెళ్లేందుకు అంగీకరించినట్టు రోజెనియర్ వెల్లడించాడు. కొద్దిసేపటికే చెల్సీ నుంచి ప్రకటన రావడంతో విషయం ఖరారైంది. ఈ సందర్భంగా రోజెనియర్ మాట్లాడుతూ చెల్సీ లాంటి గొప్ప క్లబ్‌కు కోచ్‌గా ఎంపిక కావడం తనకు గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. విజయాల సంప్రదాయం ఉన్న ఈ జట్టును మరింత ఎత్తుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు.
41 ఏళ్ల రోజెనియర్కు కోచ్‌గా మూడు సంవత్సరాల అనుభవమే ఉన్నా మారెస్కా తొలగింపుకు తర్వాత ప్రధాన ఎంపికగా మారాడు. స్ట్రాస్‌బర్గ్ చెల్సీ రెండూ ఒకే యాజమాన్య సంస్థ బ్లూకో ఆధీనంలో ఉండటంతో ఈ మార్పు త్వరగా పూర్తైంది. బ్లూకో చెల్సీని స్వాధీనం చేసుకున్న తర్వాత నియమితుడయ్యే నాలుగో శాశ్వత కోచ్‌గా రోజెనియర్ నిలవనున్నాడు.
ఆటగాడిగా ఫులహామ్ రీడింగ్ హల్ సిటీ తరఫున ఆడిన రోజెనియర్ తరువాత డర్బీ కౌంటీలో కోచ్‌గా పని చేశాడు. 2022లో హల్ సిటీ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టి 18 నెలల పాటు కొనసాగాడు. 2024లో స్ట్రాస్‌బర్గ్ కోచ్‌గా నియమితుడై గత సీజన్లో ఆ జట్టును లీగ్ వన్‌లో ఏడవ స్థానానికి చేర్చాడు. ఇదే సమయంలో మారెస్కా తన తొలి సీజన్లో యూఈఎఫ్ఏ కాన్ఫరెన్స్ లీగ్ క్లబ్ వరల్డ్ కప్ గెలిపించినా ఇటీవలి పరిణామాలతో నూతన సంవత్సర దినాన పదవి కోల్పోయాడు. ఆదివారం మాంచెస్టర్ సిటీతో జరిగిన మ్యాచ్‌లో తాత్కాలికంగా కాలమ్ మెక్‌ఫార్లేన్ జట్టును నడిపించాడు. బుధవారం చెల్సీ (Chelsea Football Club) ఫులహామ్తో తలపడనుంది.
Read Also: సమంత కొత్త సినిమాపై బిగ్ అప్డేట్..!
Follow Us On: Sharechat


