కలం, మహబూబ్నగర్ బ్యూరో: కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించిన స్వామి వారి అలంకరణ మహోత్సవ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) పాల్గొన్నారు . శనివారం అమరచింత మండల కేంద్రం నుంచి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను, ఆత్మకూరు పట్టణం ఎస్బిఐ బ్యాంకు నుంచి తీసుకువచ్చిన ఆభరణాలను ప్రత్యేక పూజ నిర్వహించి ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారికి సమర్పించారు. దక్షిణ తెలంగాణలోనే విశేష ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా భక్తుల తాకిడితో అంగరంగ వైభవంగా జరుగుతాయి.
ఉద్దాల మహోత్సవంతో పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తాయని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.

