కలం, ఖమ్మం బ్యూరో: పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యంలో భారీ గోల్మాల్ వెలుగుచూసింది. రికార్డుల్లో ఉన్న నిల్వలకు, దుకాణంలో ఉన్న సరుకుకు పొంతన లేకుండా ఏకంగా 67.42 క్వింటాళ్ల బియ్యం మాయమైనట్లు పౌరసరఫరాల శాఖ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి (Penuballi) మండల కేంద్రంలో ఈ ఘటన కలకలం రేపుతోంది. జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్ఓ) చందన్ కుమార్ శనివారం అధికారులతో కలిసి పెనుబల్లి-1 జీసీసీ చౌక ధరల దుకాణం (షాప్ నంబర్ 2231016)లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు, నిల్వలను పరిశీలించగా 67.42 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
దుకాణంలో మిగిలి ఉన్న 3 క్వింటాళ్ల సరుకును అధికారులు స్వాధీనం చేసుకుని, లబ్ధిదారులకు పంపిణీలో ఇబ్బందులు కలగకుండా సమీపంలోని మరో రేషన్ డీలర్‌కు అప్పగించారు. అక్రమాలకు పాల్పడిన డీలర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జీసీసీ మేనేజర్‌కు సిఫారసు చేశారు. నిత్యావసర వస్తువుల చట్టం-1955లోని సెక్షన్ 6-ఏ కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్ఓ తెలిపారు. రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, జిల్లాలో రేషన్ కార్డుల ఇ-కేవైసీ, మరణించిన కుటుంబ సభ్యుల పేర్ల తొలగింపుపై కూడా డీఎస్ఓ కీలక సూచనలు చేశారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 13,37,262 రేషన్ యూనిట్లు ఉండగా, ఇప్పటివరకు 84.27 శాతం యూనిట్లకే ఇ-కేవైసీ పూర్తయిందన్నారు. పెండింగ్‌లో ఉన్న కుటుంబ సభ్యులందరూ వెంటనే సమీప రేషన్ దుకాణానికి వెళ్లి ఇ-కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు. రేషన్ డీలర్లు కూడా పెండింగ్‌లో ఉన్న కార్డుదారులను గుర్తించి వారికి సమాచారం అందించాలని ఆదేశించారు. రేషన్ కార్డుల్లో మరణించిన కుటుంబ సభ్యుల పేర్లను తొలగించాలని సూచించారు. ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేసేందుకు కార్డుదారులు సహకరించాలని డీఎస్ఓ విజ్ఞప్తి చేశారు.

