కలం, వెబ్ డెస్క్: తిరుమలలో (Tirumala) డిసెంబర్ 30న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు రేపటితో (గురువారం) ముగియనున్నాయి. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో ఆలయ పరిసరాలు భక్తజన సందడితో కళకళలాడాయి. వైకుంఠ ద్వార దర్శనం చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందనే విశ్వాసంతో దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. వైకుంఠ ద్వార దర్శనాల ముగింపుతో ఎల్లుండి నుంచి తిరుమలలో సాధారణ ఆలయ కార్యకలాపాలు పునరుద్ధరించనున్నారు. ఈ క్రమంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను తిరిగి ప్రారంభించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదే సమయంలో తిరుమల (Tirumala) భక్తుల సౌకర్యం, పరిపాలనా అవసరాల దృష్ట్యా శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో టీటీడీ కీలక మార్పులు చేసింది. తాజా నిర్ణయం ప్రకారం ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ టికెట్లు మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మార్పుల వల్ల టికెట్ల లభ్యతపై భక్తులకు స్పష్టత రావడంతో పాటు, దర్శనాల నిర్వహణ మరింత సులభంగా జరుగుతుందని టీటీడీ భావిస్తోంది. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో చేపట్టిన ప్రత్యేక భద్రతా చర్యలు, క్యూలైన్ నిర్వహణను దశలవారీగా సడలించనున్నారు. ఇకపై సాధారణ దర్శనాలు, సేవలు సజావుగా కొనసాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ అధికారులు తెలిపారు.


